కరోనా చికిత్సలో అద్భుతంగా పనిచేసే 'థాప్సిగార్గిన్'... ఔషధాన్ని కనుగొన్న నాటింగ్ హామ్ వర్శిటీ!

  • గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు పెట్టిన కరోనా
  • సమర్థవంతంగా పని చేస్తున్న థాప్సిగార్గిన్
  • 'వైరసెస్' జర్నల్ లో ప్రత్యేక కథనం
  • వృక్ష సంబంధ పదార్థాల నుంచి తయారైన యాంటీ వైరల్
గత సంవత్సరం ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన కరోనా మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వేళ, మరో శుభవార్తను బ్రిటన్ కు చెందిన నాటింగ్ హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా చికిత్సకు ఇప్పుడు వినియోగిస్తున్న ఔషధాలతో పోలిస్తే, ఎన్నో వందల రెట్లు ప్రభావవంతంగా పనిచేసే యాంటీ వైరల్ ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఇది కరోనాతో పాటు, దానికి సంబంధించిన మరిన్ని వైరస్ లపైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. నాటింగ్ హామ్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు 'వైరసెస్' అనే జర్నల్ ప్రచురించింది.

కరోనా ఔషధాలపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వృక్ష సంబంధ పదార్థాల నుంచి తయారు చేసిన థాప్సిగార్గిన్ అనే వైరస్ ఔషధాన్ని నియమిత మోతాదులో ఇస్తే, అది కొవిడ్ ను శరీరంలో నాశనం చేస్తోందని కనుగొన్నారు. ఇది కొవిడ్ పైనే కాకుండా, శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించే మరో రెండు వైరస్ లపైనా పని చేస్తోందని, దీన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఇక దీన్ని వ్యాధి సోకక ముందు, సోకిన తరువాత కూడా వినియోగించవచ్చని, వేరువేరుగా గుర్తించడం సాధ్యం కాని వివిధ రకాల వైరస్ లు శరీరంలోకి ప్రవేశించిన వేళ, థాప్సిగార్గిన్ చక్కగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ వైరస్ లు శరీరంలో వృద్ధి చెందకుండా ఔషధం పని చేస్తుందని, కనీసం 48 గంటల పాటు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. దీన్ని నోటి ద్వారా తీసుకునే మాత్రగా తీసుకుని వస్తున్నామని, ఇంజక్షన్లు లేదా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఇక రాబోదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం ఈ థాప్సిగార్గిన్ ఔషధ ప్రయోగం తొలి దశలో ఉంది. ఈ తొలిదశ ఫలితాలే తమకు అత్యంత కీలకమని నాటింగ్ హామ్ శాస్త్రవేత్తల బృందంలోని ప్రొఫెసర్ కిన్ చౌ చాంగ్ వెల్లడించారు. భవిష్యత్తులో మానవాళిని ఇబ్బంది పెట్టనున్న వైరస్ లు కూడా జంతువుల్లోనే పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. వాటిని అరికట్టాలంటే థాప్సిగార్గిన్ వంటి కొత్త తరం యాంటీ వైరల్ ఔషధాల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.


More Telugu News