కేసుల పేరుతో కేసీఆర్ ను మోదీ లొంగదీసుకున్నారు: రేవంత్ రెడ్డి

  • తమిళనాడు ఎన్నికల ఇన్చార్జిగా కిషన్ రెడ్డిని నియమించడం వెనుక కేసీఆర్ ఉన్నారు
  • బీజేపీకి సహకరిస్తానని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు
  • బండి సంజయ్ ఆటలో అరటిపండు వంటివారు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి నియామకం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు బీజేపీకి కేసీఆర్ నిధులను సమకూరుస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడులో పెట్టి బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అధికారులు తమిళనాడులో ఉన్నారనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఆటలో అరటిపండు వంటి వారని అన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న బండి సంజయ్ ఇంత వరకు ఒక్క కేసును కూడా ఎందుకు నమోదు చేయించలేకపోయారని ప్రశ్నించారు. మోదీకి, కేసీఆర్ కు మధ్య ఒప్పందం ఉందని... అందుకే కేసులు బయటకు రావడం లేదని చెప్పారు. కేసుల పేరుతో కేసీఆర్ ను మోదీ లొంగదీసుకున్నారని అన్నారు.


More Telugu News