ఏపీలో దేవాలయాలపై 140 దాడులు జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందనే లేదు: రాజ్యసభలో జీవీఎల్

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థులపై ఆరోపణలకు దిగుతోంది
  • దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడంలో విఫలమైంది
  • ఈ దాడులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు పార్లమెంటును తాకాయి. దాడుల అంశాన్ని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించారు. ఏడాది కాలంగా ఏపీలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాల వంటి ఘటనలు 140 జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్వేదిలో రథం దగ్ధం, రామతీర్థంలో రాముడి విగ్రహం తలను తొలగించడం వంటి ఘటనలు జరిగాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆరోపణలకు దిగుతోందని అన్నారు.

నిందితులను అరెస్ట్ చేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవిఎల్ మండిపడ్డారు. కేవలం సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని అన్నారు. ఆలయాలపై దాడుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పట్టుకోవడంపై మాత్రం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నివేదికను కోరాలని విజ్ఞప్తి చేశారు. 


More Telugu News