విజయనగరంలో రూ. 73.68 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  • రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్
  • ఆపరేషన్ థియేటర్ తో పాటు ఆసుపత్రిలో అన్ని సేవలు
  • 2023 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యం
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో ఆసుపత్రిని మంజూరు చేసింది. విజయనగంలో రూ. 73.68 కోట్ల వ్యయంతో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

ఈ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య సేవలతో పాటు ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లకు అన్ని వసతులను కల్పించబోతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ సేవలు, డయాగ్నోస్టిక్ సేవలు, మందులు, లేబర్ రూమ్ తదితరాలన్నీ ఉంటాయని చెప్పారు. ఆయుష్ పథకం కింద కూడా రోగులకు ఇక్కడ సేవలను అందిస్తారని తెలిపారు. 2023 నాటికి ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులుగా గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకాన్ని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అర్హులైన మధ్య తరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని కేంద్రం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని చెప్పారు. వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్ ద్వారా వారు రుణం తీసుకున్న సంస్థలకు కేంద్రం బదలాయిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని వెల్లడించారు.


More Telugu News