బ్రిటీష్ పాలనలో సైతం చట్టాలను వెనక్కి తీసుకున్నారు: గులాం నబీ ఆజాద్

  • బ్రిటీష్ హయాంలో ఒకసారి వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు
  • మనం వెనక్కి తీసుకోవడంలో ఇబ్బంది ఏముంది?
  • జమ్మూకశ్మీర్ ను రెండు ముక్కలు చేయాలనే డిమాండ్ గతంలో బీజేపీ నుంచి రాలేదు
కొత్త వ్యవసాయ చట్టాల అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తోంది. ఈ చట్టాలను రద్దు చేయాలని విపక్షాలు డిమండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలనలో కూడా ఒకసారి వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు మన రైతుల కోసం మనం చట్టాలను వెనక్కి తీసుకోవడంలో ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు.

ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు రైతులు అదృశ్యమయ్యారని ఆజాద్ ఆరోపించారు. జనవరి 26 నుంచి అదృశ్యమైన వారి గురించి ఒక కమిటీని వేయాలని ప్రధాని మోదీని కోరుతున్నామని చెప్పారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసను తాము ఖండిస్తున్నామని కూడా ఆయన అన్నారు. అయితే, వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మూకశ్మీర్ ను రెండు ముక్కలుగా చేయాలనే డిమాండ్ గతంలో బీజేపీ నుంచి రాలేదని అన్నారు. తమను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ లేహ్ ప్రాంతం నుంచి మాత్రమే వచ్చిందని, కార్గిల్ ప్రాంతం నుంచి రాలేదని చెప్పారు.

ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరింప చేశారని విమర్శించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో కూడా ఇంత సెక్యూరిటీని ఎప్పుడూ చూడలేదని అన్నారు.


More Telugu News