రైతు నిరసనలపై పార్లమెంట్ లో ఏకాభిప్రాయం... 15 గంటల చర్చ!

  • దాదాపు మూడు నెలలుగా రైతుల నిరసనలు
  • రెండు రోజుల ప్రశ్నోత్తరాల సమయం రద్దు
  • అన్ని అనుమానాలు తీరుస్తామన్న కేంద్ర ప్రభుత్వం
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించి, ఎక్కడికీ కదలకుండా రైతులు నిరసనలు తెలియజేస్తున్న వేళ, దీనిపై చర్చించాలని పార్లమెంట్ నిర్ణయించింది.

రైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని విపక్ష పార్టీలు చేసిన డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని రాజ్యసభ నిర్ణయించింది. ఈ చర్చ రాజ్యసభలో జరుగుతుందని విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలు తీరుస్తామని, చర్చా అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే రైతుల సమస్యలు, సాగు చట్టాలపై చర్చ మొదలవుతుందని, ఇది రెండు రోజుల పాటు సాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ ఉదయం సభలో ప్రకటించారు. ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు రైతు సమస్యలపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఈ విషయమై నినాదాలు చేస్తూనే ఉండటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన చైర్మన్, ఆపై సభను వాయిదా వేశారు.

ఆ వెంటనే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఓ ప్రకటన విడుదల చేస్తూ, సభ్యుల విపక్ష డిమాండ్ ను అంగీకరిస్తూ, 15 గంటల పాటు రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే భావిస్తోందని అన్నారు. ఇదే విషయమై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్, "మా డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించినందున అన్ని రైతు సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాము. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి ముందే ఇది జరగాలి. లేకుంటే మరింత సమయం కేటాయించాలి" అని అన్నారు.

ఇక నేడు, రేపు ప్రైవేటు మెంబర్ బిల్లులను, సభ్యులు లేవనెత్తే సమస్యలపై చర్చలను అనుమతించబోమని రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు.


More Telugu News