శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ వాహనంపై రాళ్ల దాడి.. ఉద్రిక్తత!

  • పంజాబ్ లోని జలాలాబాద్ లో ఘటన
  • ఘటనకు కాంగ్రెస్ కారణమన్న అకాలీదళ్
  • అమరీందర్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్న హర్ సిమ్రత్ కౌర్
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ వాహనంపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పంజాబ్ లోని జలాలాబాద్ లో చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తమ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా నిలబడిన వ్యక్తులు వాహనంపై రాళ్లు రువ్వారు. వెంటనే అక్కడే ఉన్న అకాలీదళ్ నేతలు కూడా అదే స్థాయిలో ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగారు. బాదల్ ను దాడి నుంచి రక్షించారు.

ఈ దాడిపై అకాలీదళ్ స్పందిస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీనే దీనికి కారణమని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపింది. తమ పార్టీ కార్యకర్తలు బాదల్ ను రక్షించారని చెప్పింది. దాడి సందర్భంగా తమ కార్యకర్తలపై తుపాకీ కాల్పులు కూడా జరిగాయని, ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపింది. బాదల్ కు ఎలాంటి హాని జరగలేదని వెల్లడించింది.

బాదల్ భార్య, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆమె మండిపడ్డారు. జలాలాబాద్ ఎమ్మెల్యే, ఆయన కొడుకు కాంగ్రెస్ గూండాలతో కలిసి ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఫామ్ హౌస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. సీఎంగా కొనసాగే అర్హత అమరీందర్ కు లేదని అన్నారు.


More Telugu News