ధ్వంసమైన కారుతో సీఎం నివాసానికి వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం... విజయవాడలో ఉద్రిక్తత

  • విజయవాడలో పట్టాభిరామ్ కారుపై దాడి
  • పట్టాభిరామ్ కు గాయాలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు
  • సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని టీడీపీ నేతల నిర్ణయం
  • అడ్డుకున్న పోలీసులు
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై ఇవాళ విజయవాడలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. పట్టాభిరామ్ కారులో ఆఫీసుకు వెళుతుండగా కొందరు దుండగులు రాడ్లతో దాడి చేశారు. కారు ధ్వంసం కాగా, ఈ దాడిలో పట్టాభిరామ్ గాయపడ్డారు. ఈ ఘటనతో పార్టీ అధినేత చంద్రబాబు సహా, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

కాగా, విజయవాడలో దుండగుల దాడిలో ధ్వంసమైన కారుతో సహా టీడీపీ నేతలు సీఎం జగన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తనపై జరిగిన దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పట్టాభి, ఇతర టీడీపీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారిని పట్టాభి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారు సీఎం నివాసం వెపు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో, పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించారు.

పట్టాభిరామ్ నివాసానికి వచ్చినవారిలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు.


More Telugu News