ప‌ట్టాభిని చంపాల‌నే దాడి చేశారు.. చంపండి చూస్తాం.. ఖ‌బ‌డ్దార్‌: నిప్పులు చెరిగిన‌ చ‌ంద్ర‌బాబు

  • వైసీపీ నేత‌లు రెచ్చిపోతున్నారు 
  • వారికి క‌ళ్లు నెత్తికెక్కాయి
  • ప‌ట్టాభిపై దాడికి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి
  • ఇనుప రాడ్లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో దుండ‌గుల దాడి
  • ప‌ట్టాభి బ‌లంగా ఉంటారు కాబ‌ట్టి త‌ట్టుకోగ‌లిగారు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు  విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి చేరుకుని, ప‌రామ‌ర్శించి మీడియాతో మాట్లాడారు.  

'రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నాను. వైసీపీ నేత‌లు గూండాలుగా త‌యారైపోయారు. వారికి క‌ళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగ‌ల‌మ‌ని భావిస్తున్నారు. కొంత మంది క‌లిసి ఓ ప‌థ‌కం కూడా వేశారు. ప‌ట్టాభిపై దాడికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

'ప్ర‌భుత్వ అవినీతిని ప‌ట్టాభి ప్ర‌శ్నిస్తున్నారు అందుకే ఆయ‌న‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వైసీపీ నేత‌లు బ‌రి తెగించి దాడులు చేస్తున్నారు. ప‌ట్టాభిని చంపాల‌నే దాడి చేశారు. ఇంత‌కు ముందు కూడా ప‌ట్టాభిపై దాడి జ‌రిగింది. ఈ కాల‌నీలో ప్ర‌తి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

'దీన్ని బ‌ట్టి ఆ ప్రాంతంలో దాడులు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకోవ‌చ్చు
ప‌ట్టాభిని చంపే ప్ర‌య‌త్నం చేశారు. ఇనుప రాడ్లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో దుండ‌గులు వ‌చ్చి దాడి చేశారు. డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు లాగేశారు. ప‌ట్టాభి బ‌లంగా ఉంటారు కాబ‌ట్టి త‌ట్టుకోగ‌లిగారు. వేరే వార‌యితే త‌ట్టుకోలేక‌పోయే వారు. వైసీపీ నేత‌లు ఏమ‌నుకుంటున్నారు?' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

'ఈ దాడి ఘ‌ట‌న‌ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్ప‌ష్టంగా రికార్డ‌య్యాయి. ఓ వైపు దేవాల‌యాల‌పై దాడులు చేస్తున్నారు. మ‌రోవైపు, నేత‌ల‌పై దాడులు చేస్తున్నారు. టీడీపీ నేత‌లంద‌రూ వైసీపీ దాడుల‌ను ఎండ‌గ‌డుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు టీడీపీ నేత‌ల‌పై దాడుల‌కు దిగుతున్నారు. ఇది పులివెందుల కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవా‌లి' అని చంద్ర‌బాబు నాయుడు హెచ్చరించారు.

'దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ వైపు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్క‌డ ప‌ట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్ర‌జ‌ల‌పై దాడి. ప్ర‌జ‌ల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చ‌ంపేస్తారా అంద‌ర్నీ? చ‌ంపండి చూస్తాం. ఖ‌బ‌డ్దార్ జాగ్ర‌త్త‌గా ఉండండి' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

'మీ బూతు మంత్రులకు చెప్పుకో జ‌గ‌న్.. ఇటువంటివి జ‌రిగితే చూస్తూ ఊరుకోబోము. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎక్క‌డైనా ఇటువంటి దాడులు జ‌రిగాయా?  మా నేత‌లు ఎవ‌రైనా తప్పుగా మాట్లాడితేనే నేను వారిని కంట్రోల్ చేసేవాడిని. గ‌తంలో టీడీపీ నేత‌ల‌పై దాడులు జ‌రిగితే డీజీపీ స‌రైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మ‌ళ్లీ దాడి జ‌రిగేవి కాదు' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

'మీకు జీతం ఎవ‌రు ఇస్తున్నారు? జ‌గ‌న్ ఇవ్వ‌ట్లేదు. ప్ర‌జ‌లు క‌డుతోన్న పన్నుల‌తో మీకు జీతం వ‌స్తోంది. మేము ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతున్నాం. అటువంటి మాపై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు. వెంట‌నే రాజీనామా చేయాలి' అని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'ఈ రోజు మావాళ్లంద‌రూ క‌లిసి ముఖ్య‌మంత్రి ఇంటికి వెళ్తారు.. ఈ దాడులను క‌ట్టడి చేయాల‌ని ఆయ‌న‌ను అడుగుతారు. ఎందుకిలా దాడులు చేయిస్తున్నార‌ని అడుగుతారు. మా ప్రాణాలు కావాలా? అని అడుగుతారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్పంద‌న ఎలా ఉంటుందో చూసి పోరాడ‌తాం' అని చంద్ర‌బాబు అన్నారు.


More Telugu News