సమష్టి నిర్ణయంతోనే కేటీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రి అవుతారు: జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్

  • శ్రీవారిని ద‌ర్శించుకున్న బొంతు
  • ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నేత‌
  • ఇది నా‌ వ్యక్తిగత అభిప్రాయం  
  • కేటీఆర్‌కు శక్తిని ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించానన్న మేయర్ 
తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉందంటూ కొన్ని నెల‌లుగా ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్  బొంతు రామ్మోహన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ రోజు ఉద‌యం తిరుమల శ్రీవారిని ఆయ‌న‌ దర్శించుకున్నారు.

అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమష్టి నిర్ణయంతోనే కేటీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రి పదవిని చేపడతారని ఆయ‌న అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కేటీఆర్‌కు శక్తిని ఇవ్వాలని తాను శ్రీవారిని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారన్న‌ది త‌న‌ వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు.

కాగా, ఈ రోజు ఉద‌యం  వీఐపీ ద‌ర్శ‌నంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో ఝార్ఖండ్ మంత్రి మిథిలేశ్ కూమార్ ఠాకూర్, భార‌త‌ క్రికెటర్ శ్రీశాంత్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.


More Telugu News