నా 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు: నిమ్మగడ్డ

  • ఏపీలోని పలు జిల్లాల్లో ఎస్ఈసీ పర్యటన
  • ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన
  • న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని వెల్లడి
  • స్వీయ నియంత్రణ పాటిస్తానని స్పష్టీకరణ
  • ఏకగ్రీవాలకు తాము పూర్తి వ్యతిరేకం కాదని వ్యాఖ్య 
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే జిల్లాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని అన్నారు.  రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని స్పష్టం చేశారు. తమ విధుల్లో ఇతరులు జోక్యం చేసుకున్నారు గనుకనే కోర్టుకు వెళ్లామని వివరించారు.

ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. బాధ్యతలు నిర్వర్తించేందుకే అధికారాలు ఇచ్చారని... అయితే తన పరిధి, తన బాధ్యతలు తనకు తెలుసని, అందుకే స్వీయ నియంత్రణ పాటిస్తానని తెలిపారు.

అటు, పలు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపైనా ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పందించారు. ఏకగ్రీవాలపై తమకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉందని, ఏకగ్రీవాలకు తాము పూర్తి వ్యతిరేకం కాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయని, బలవంతపు ఏకగ్రీవాలు చేస్తేనే సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు.


More Telugu News