అంబేద్కర్ ను అవమానించడం అంటే భారత జాతిని అవమానించడమే: పవన్ కల్యాణ్

  • అంబేద్కర్ మెడలో చెప్పులదండ వేశారన్న పవన్
  • తీవ్రమైన దుశ్చర్య అంటూ ఆగ్రహం
  • 36 గంటలు గడుస్తున్నా చర్యలు లేవని అసంతృప్తి
  • వెంటనే దోషులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ వేయడం తీవ్రమైన దుశ్చర్య అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సంఘ విద్రోహ శక్తుల చర్య అని పేర్కొన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుడిని అవమానించడం అంటే యావత్ భారతజాతిని అవమానించడమేనని స్పష్టం చేశారు. దేశానికి దశ-దిశ చూపే మహానుభావుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా? అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్ విగ్రహం పట్ల అపచారం జరిగి 36 గంటలు దాటిపోతున్నా, రాష్ట్రప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఇలాంటి దుస్సంఘటనలలో దోషులను వెంటనే శిక్షించకపోతే ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్టవుతుందని, మరో దుస్సంఘటనకు అవకాశం ఇచ్చినట్టవుతుందని వివరించారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా, వారెంత బలవంతులైనా కఠినంగా దండించకపోతే దుష్టశక్తులు మరింత చెలరేగిపోయే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వెలిబుచ్చారు.

దోషులకు శిక్షపడే వరకు జరిగే పోరాటంలో జనసేన ముందుంటుందని, చింతలపూడిలో జరుగుతున్న శాంతియుత నిరసనల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొంటున్నాయని వెల్లడించారు.


More Telugu News