ప్రధాని మోదీ నోట హైదరాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ మాట!

  • బోయిన్ పల్లి మార్కెట్ లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి
  • ప్రతి రోజు 500 యూనిట్ల విద్యుత్తు, 30 కేజీల జీవ ఇంధనం ఉత్పత్తి 
  • ఇది చాలా అద్భుతం అన్న ప్రధాని మోదీ
హైదరాబాదులోని బోయిన్ పల్లిలో ఉన్న కూరగాయల మార్కెట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ బాధ్యతను నెరవేర్చే విషయంలో మార్కెట్ చేస్తున్న పనులు తనకు సంతోషాన్నిచ్చాయని, వారి విధానం గురించి చదవడం కూడా తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని చెప్పారు.

కూరగాయల మార్కెట్లో అనేక కారణాల వల్ల కూరగాయలు చెడిపోతుంటాయని... వీటిని పడేయటం వల్ల అపరిశుభ్రత వ్యాపిస్తుందని అన్నారు. కానీ బోయిన్ పల్లి మార్కెట్ మాత్రం పాడైపోయిన కూరగాయలను పడేయకూడదని నిర్ణయించిందని చెప్పారు. ఈ మార్కెట్ తో సంబంధం ఉన్నవారు... కుళ్లిపోయినవాటితో విద్యుత్తును సృష్టించాలని నిర్ణయించారని తెలిపారు.

వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేయడం గురించి అందరూ వినే ఉంటారని మోదీ అన్నారు. కానీ, కూరగాయల మార్కెట్ వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండటం గొప్ప విషయమని చెప్పారు. ఇది వ్యర్థాల నుంచి బంగారాన్ని తయారు చేసే దిశగా జరుగుతున్న ప్రయాణమని కొనియాడారు.

బోయిన్ పల్లి మార్కెట్ విషయానికి వస్తే... ప్రతిరోజు అక్కడ 10 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. ఈ వ్యర్థాలను ఒక ప్లాంట్ లో వేసి, ప్రతి రోజు 500 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు, దీని ద్వారా ప్రతిరోజు దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా తయారవుతోంది. ఈ జీవ ఇంధనాన్ని ఉపయోగించి ఆ మార్కెట్లోని క్యాంటీన్ లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు.


More Telugu News