బడ్జెట్ పై గంపెడాశలతో... లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్!

  • మరికాసేపట్లో పార్లమెంట్ ముందుకు బడ్జెట్
  • 400 పాయింట్లకు పైగా లాభంలో బీఎస్ఈ సెన్సెక్స్
  • 100 పాయింట్ల లాభంలో నిఫ్టీ సూచిక
నేడు పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్, కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఉంటుందని, పలు రంగాలకు మినహాయింపులు లభిస్తాయన్న అంచనాలతో ఈ ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే, 414 పాయింట్లు లాభపడి, 46,700 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 106 పాయింట్లు లాభపడి 13,740 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

సెషన్ ఆరంభంలో నిఫ్టీ సూచిక 13,750 పాయింట్లను దాటింది. దాదాపు అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లూ లాభాల్లో ఉన్నాయి. టూరిజం, హెల్త్, ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెడ్డీఎఫ్సీ, టాటా స్టీల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర కంపెనీలు రెండు నుంచి 8 శాతం వరకూ లాభాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో పవర్ గ్రిడ్, అల్ట్రా సిమెంట్స్, యూపీఎల్ తదితర కంపెనీలు ఒకటి నుంచి 7 శాతం వరకూ నష్టాల్లో ఉన్నాయి.


More Telugu News