ఆధార్ కార్డుతో 16 రకాల సేవలు... లెర్నింగ్ లైసెన్స్ ఆన్ లైన్ లోనే!

  • రవాణా శాఖ ద్వారా అందే సేవలు ఆన్ లైన్ లో
  • ప్రస్తుతం ముసాయిదా రూపంలో బిల్లు
  • మార్చిలోగా అమలులోకి వచ్చే అవకాశం
ఆధార్ కార్డుతో మరిన్ని రకాల సేవలను ప్రజలకు అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలో పేరు, చిరునామా మార్పు తదితర ఆర్టీయే సేవలన్నీ ఇకపై ఇంటి నుంచే పొందవచ్చు. వచ్చే నెలలో లేదా మార్చిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్టీయే కార్యాలయాలకు వెళ్లే పౌరులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖలో మార్పులు చేసేలా కొత్త నిర్ణయాలు వెలువడనున్నాయని ఆయన అన్నారు. రవాణా కార్యాలయాల్లో ఆన్ లైన్ సేవల కోసం ఇప్పటికే సమాచార సాంకేతిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తే, రవాణా శాఖ నుంచి అందే 16 రకాల సేవలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు. వెహికల్ టెంపరరీ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ ను కూడా ఇంటి నుంచే తీసుకోవచ్చని, ఈ విషయంలో రాష్ట్రాలకు ఏమైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లో తెలియజేయాలని కోరామని అన్నారు.

ప్రస్తుతం ముసాయిదా రూపంలో ఉన్న ఈ కొత్త నిర్ణయాలు మార్చిలోగా అమలులోకి వస్తాయని సమాచారం. లెర్నింగ్ లైసెన్స్, దాని రెన్యువల్, డూప్లికేట్ డీఎల్, అడ్రస్ చేంజ్, వాహన రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసీ, వాహన బదిలీ, డూప్లికేట్ ఆర్సీ తదితర సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చు.


More Telugu News