పోలియో చుక్కలు వేసిన కాసేపటికే.. చిన్నారి మృతి!

  • పోలియో చుక్కలు వేయించుకున్న పది నిమిషాలకే అస్వస్థత
  • ఆసుపత్రికి తరలించే సరికే కన్నుమూత
  • చిన్నారి మృతికి పోలియో చుక్కలు కారణం కాదన్న వైద్యాధికారి
పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి కాసేపటికే అస్వస్థతతో మృతి చెందిన ఘటన మల్కాజిగిరి జిల్లా మహేశ్వరంలో జరిగింది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీల దంపతులకు 16 నెలల దీక్షిత అనే కుమార్తె ఉంది. రమీల ప్రస్తుతం కుమార్తెతో కలిసి మహేశ్వరంలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది.

నిన్న పోలియో చుక్కలు వేసే రోజు కావడంతో ఉదయం 11.45 గంటల సమయంలో శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో దీక్షితకు పోలియో చుక్కలు వేయించి ఇంటికెళ్లారు. ఆ తర్వాత పది నిమిషాలకే చిన్నారి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చిన్నారిని తరలించారు. అయితే, అప్పటికే దీక్షిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కుమార్తె మృతికి పోలియో చుక్కలే కారణమని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ స్పందించారు. పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదని, ఆ పాపకు వేసిన తర్వాత మరో 17 మందికి అదే సీసాలోని చుక్కలు వేశామని పేర్కొన్నారు. అయినా వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పేర్కొన్నారు. పుట్టినప్పుడే కొందరి గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉండే అవకాశం ఉందని, చిన్నారి మృతికి బహుశా అదే కారణమై ఉండొచ్చని మల్లికార్జున్ పేర్కొన్నారు.


More Telugu News