గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం

  • పొలం అమ్మగా వచ్చిన సొమ్ముతో బస్సులో ప్రయాణం 
  • తనిఖీల్లో గుర్తించిన పోలీసులు
  • సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు
పొలం విక్రయించగా వచ్చిన రూ. 1.10 కోట్ల నగదుతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద గత రాత్రి జరిగిందీ ఘటన. చెక్‌పోస్టు వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు ఓ వ్యక్తి బ్యాగులో భారీ మొత్తంలో నగదును గుర్తించారు. ఆ సొమ్ముకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన రాయల సత్యనారాయణ.. కుమారుడు శ్రావణ్ కుమార్‌తో కలిసి తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ఒంగోలు గ్రామం నుంచి బస్సులో బయలుదేరాడు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు సత్యనారాయణ బ్యాగులో రూ. 1.10 కోట్ల నగదును గుర్తించారు. అంత సొమ్ము ఎక్కడిదని ప్రశ్నించగా ఒంగోలు గ్రామంలో తనకున్న 16 ఎకరాలను అమ్మగా వచ్చిన డబ్బులని చెప్పారు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తున్నట్టు చెప్పారు. అయితే, ఆ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఆయన వద్ద లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News