ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలో లేరు.. చర్యలు తీసుకోలేం: ఎస్‌ఈసీకి స్పష్టం చేసిన ఏపీ సీఎస్

  • సమావేశంలో అధికారులు పాల్గొనకుండా చేసినట్టు ఆరోపణలు
  • బదిలీ చేయాలంటూ సీఎస్ ఆదేశాలు
  • ఎస్‌ఈసీకి బదులిచ్చిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాసిన లేఖకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ బదులిచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలో లేరని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోలేమని పేర్కొన్నారు. అంతేకాదు, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని, కాబట్టి జారీ చేసిన ఆదేశాలను మరోమారు పరిశీలించాలని సీఎస్ తన లేఖలో కోరారు.

ఈ నెల 23న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనకుండా జిల్లా అధికారులను ప్రవీణ్ ప్రకాశ్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖకు స్పందించిన ప్రవీణ్ ప్రకాశ్ తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని, పరిధి దాటలేదని స్పష్టం చేశారు. తాను ఎవరినీ నియంత్రించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.

మరోపక్క, ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేయాలని ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని మరో లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారి ఆదేశాలు అమలు చేయకుంటే అది కోర్టు ధిక్కరణే అవుతుందని హెచ్చరించారు. ఎస్‌ఈసీ లేఖకు స్పందించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలో లేరు కాబట్టి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారు.


More Telugu News