మహిళను నామినేషన్ కేంద్రానికి తీసుకెళుతుంటే మా కారుపై కర్రలతో దాడి చేశారు: టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు

  • ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం
  • పలుచోట్ల ఉద్రిక్తతలు
  • టీడీపీ శిబిరంపై దాడి జరిగిందన్న దొరబాబు
  • వాహనాలు ధ్వంసం చేశారని వెల్లడి
  • నిమ్మాడలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ ఆఖరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. కాగా, పలుచోట్ల ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు.

దొరబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెరియంబాడి వెళ్లిన మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. మహిళను పోలీసు భద్రతతో నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లానని దొరబాబు వివరించారు. తమ కారుపై కర్రలతో దాడి చేశారని వెల్లడించారు. అయితే డ్రైవర్ వేగం పెంచడంతో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయానికి కిలోమీటరు దూరంలోని టీడీపీ శిబిరంపై దాడి జరిగిందని అన్నారు. ఈ ఘటనలో కారు, ఓ వ్యాను, 20 బైకులు ధ్వంసం చేశారని దొరబాబు వెల్లడించారు.

కాగా, శ్రీకాకుళం నిమ్మాడ నామినేషన్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ జరిగింది. వైసీపీ తరఫున నామినేషన్ వేసేందుకు కింజరాపు అప్పన్న రాగా... వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.


More Telugu News