పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ మంత్రి పితాని

  • ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలా ప్రచారం చేస్తున్నారు
  • పాత్రికేయ రంగానికే సిగ్గుచేటు
  • అధికార మదంతో విర్రవీగుతున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరబోతున్నారని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలా పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్ని ప్రసార, సామాజిక మాధ్యమాలు వ్యక్తుల విలువలను మంటగలిపేలా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగానికే ఇది సిగ్గుచేటని అన్నారు. తాను ఓడిపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉన్నానని, ప్రజా సమస్యలపై నేటికీ పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీకి అమ్ముడుపోయి తనను మలిన పరచడం ఏంటని పితాని ప్రశ్నించారు. అధికార మదంతో స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని ప్రజలను పితాని కోరారు.


More Telugu News