ఏపీ స్థానిక ఎన్నిక‌ల నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో ప‌లు చోట్ల ఉద్రిక్త‌త‌లు!

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ప‌లు ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌
  • నామినేషన్ వేసేందుకు వెళ్తున్న అభ్య‌ర్థి అడ్డ‌గింత‌
  • నామినేష‌న్ ప‌త్రాలు లాక్కున్న వైనం
  • శాసనం పంచాయతీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. రెండో రోజు కూడా నామినేష‌న్ల స్వీక‌రణ ప్ర‌క్రియ కొన‌సాగింది. అయితే, ఈ సంద‌ర్భంగా ప‌లు చోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ప‌లు ప్రాంతాల్లో నామినేషన్  వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను కొన్ని చోట్ల అడ్డుకున్నారు. వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు లాక్కొన్నారు.  అయోధ్యపురం కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు వెళ్లిన గున్న సుధ నామినేషన్ పత్రాలను రెండుసార్లు లాక్కున్న‌ట్లు అభ్య‌ర్థులు మీడియాకు తెలిపారు.

తొలి సారి నామినేషన్ పత్రాలను వారు పట్టుకుపోయార‌ని చెప్పారు. దీంతో తాము మ‌ళ్లీ ప‌త్రాల‌తో వెళ్ల‌గా మ‌ళ్లీ లాక్కొని వాటిని బావిలో పడేసినట్లు ఆ గ్రామ‌ సర్పంచి అభ్యర్థి కుటుంబసభ్యులు వివ‌రించారు. దీంతో వారు టెక్కలి ఎస్సై కామేశ్వరరావు సాయంతో మ‌ళ్లీ వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

శాసనం పంచాయతీకి చెందిన ముడిమంచి చిలకన్న దగ్గర నుంచి కూడా నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కునేందుకు వైసీపీ కార్యకర్త ఢిల్లీశ్వరరావు ప్రయత్నించడంతో అక్క‌డున్న పోలీసులు ఆ చ‌ర్య‌ల‌ను అడ్డుకున్నారు.

తలగాంలోని నామినేషన్ కేంద్రం వద్ద కూడా ఇటువంటి ఘ‌ట‌న‌లే వెలుగులోకి వ‌చ్చాయి. తలగాం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి కోట కళావతి, మ‌రో ఆరుగురు వార్డు సభ్యులు నామినేషన్ వేసేందుకు వెళ్ల‌గా పేరాడ వినోద్ కుమార్ అనే వ్య‌క్తి పత్రాలు తీసుకొని పారిపోయాడు. పోలీసులు వెంట‌నే అత‌డిని ప‌ట్టుకుని వాటిని తిరిగి తీసుకున్నారు.  


More Telugu News