సర్పంచి అభ్యర్థి తిరుపతిరావు కిడ్నాప్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను: చంద్రబాబు

  • పెద్ద గంజాంలో పోటీకి నిలబడుతున్న తిరుపతిరావు కిడ్నాప్
  • ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా? అని ప్రశ్నించిన చంద్రబాబు
  • శాంతిభద్రతలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్య
సర్పంచిగా పోటీ చేస్తున్న టీడీపీ నేతలను కిడ్నాప్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పర్చూరు నియోజకవర్గం, చిన్న గంజాం మండలం, పెద్ద గంజాంలో స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడుతున్న సర్పంచి అభ్యర్థి తిరుపతిరావు కిడ్నాప్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఏమిటీ ఆటవిక సంస్కృతి? అని ప్రశ్నించారు. ఎన్నిక అనేది లేకుండా గెలవడానికి ఆంధ్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందా? అని నిలదీశారు.

తమపై ప్రత్యర్థులెవరైనా పోటీకి నిలబడితే ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని వైసీపీ వాళ్లు భయపడుతున్నారనడానికి ఇది నిదర్శనమని అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థికి కనీస రక్షణ కూడా కల్పించలేకపోయారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

తిరుపతిరావును సురక్షితంగా తిరిగి తెచ్చి, నామినేషన్ వేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. కిడ్నాప్ కు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న చోట వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News