మంత్రులు ఎన్నిక‌ల‌ కోడ్‌ను ఉల్లంఘించకూడ‌దు: సీఎస్‌కు నిమ్మ‌గ‌డ్డ రమేశ్ లేఖ‌

  • మంత్రుల‌ పర్యటనల్లో అధికారులు ఉండకూడదు 
  • వారి ప్ర‌తి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాలి
  • విలేక‌రుల సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలు వాడకూడదు 
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు ఆదేశాలు ఇస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ‌లు రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్ ఈ రోజు మ‌రో లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాల‌ని చెప్పారు.

నోటిఫికేషన్ ఇప్ప‌టికే విడుద‌లైంద‌ని, మంత్రులు ఎన్నిక‌ల‌ కోడ్‌ను ఉల్లంఘించకూడదని ఆ లేఖ‌లో తెలిపారు. మంత్రుల‌ పర్యటనల్లో అధికారులు ఉండేందుకు వీల్లేదని చెప్పారు. నేత‌లు పార్టీ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, ప్రచారాల్లో పాల్గొంటోన్న స‌మ‌యంలోనూ ప్రభుత్వ వాహనాలను వాడ‌రాద‌ని చెప్పారు.

అలాగే, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేప‌ట్టే ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని అన్నారు. వారి ప‌ర్య‌ట‌న‌ల‌ను అధికార పర్యటనలతో ముడిపెట్టవ‌ద్ద‌ని చెప్పారు. అలాగే, విలేక‌రుల సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలతో పాటు ఇత‌ర ప్ర‌భుత్వ‌ సదుపాయాలను వినియోగించకూడదని చెప్పారు.


More Telugu News