ప్రతిపక్షాలతో కేంద్ర ప్రభుత్వం భేటీ

  • మంత్రులు రాజ్ నాథ్, ప్రహ్లాద్ జోషిల వీడియో కాన్ఫరెన్స్
  • సభ సాఫీగా సాగేలా చూడాలని కోరిన మంత్రులు
  • తగ్గేదే లేదని తేల్చి చెప్పిన ప్రతిపక్ష నేతలు
  • సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్
లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం, సభలో రసాభాస సృష్టించడం వంటి ఘటనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సమావేశమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలు శుక్రవారం.. ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీధరన్ కూడా అందులో పాల్గొన్నారు.

శుక్రవారం ప్రారంభమైన సమావేశాలు సాఫీగా సాగేలా చూడాలని ప్రతిపక్ష నేతలను వారు కోరారు. అయితే, తగ్గేదే లేదని ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నట్టు తెలుస్తోంది. సాగు చట్టాలను రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని అన్నట్టు సమాచారం. ఇప్పటికే సభలో సాగు చట్టాల కాపీలను చించేసి వెల్ లోకి దూసుకెళ్లి ప్రతిపక్ష నేతలు నిరసన తెలిపారు.

మరోవైపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రపతిని గౌరవించాలని ప్రతిపక్షాలకు ప్రహ్లాద్ జోషి కోరారు.


More Telugu News