పంజాబ్​, హర్యానాల్లోని 45 బియ్యం, గోధుమ గోడౌన్లపై సీబీఐ దాడులు!

  • రెండేండ్లలో సేకరించిన ధాన్యం నమూనాల సీజ్
  • ఎఫ్ సీఐ గోదాముల్లోనూ అధికారుల తనిఖీలు
  • ధాన్యం సేకరణలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుతో చర్యలు
సాగు చట్టాల రద్దు డిమాండ్ తో రెండు నెలలుగా పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినా అవి ఒక కొలిక్కి రాలేదు. ఆ విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు పంజాబ్ , హర్యానాల్లోని గోదాములపై సీబీఐ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లోని 45 గోదాములపై దాడులు చేసిన అధికారులు.. బియ్యం, గోధుమల శాంపిళ్లను సీజ్ చేశారు. పారామిలటరీ బలగాల సాయంతో అధికారులు అక్కడ గురువారం రాత్రి నుంచి సోదాలు చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దాడులు చేసిన వాటిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) గోడౌన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. ధాన్యం సేకరణలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది.

అధికార వర్గాల సమాచారం ప్రకారం పంజాబ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్ మెంట్ కార్పొరేషన్, పంజాబ్ వేర్ హౌసింగ్, కొన్ని ఎఫ్ సీఐ గోడౌన్లలో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 2019–2020, 2020–2021లో సేకరించిన ధాన్యం నమూనాలను పరిశీలన కోసం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాడులు జరిగిన గోడౌన్లలో 35 పంజాబ్ లోనే ఉన్నాయంటున్నారు. కాగా, దీనిపై సీబీఐ నుంచి ఇంకా  ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ ల నుంచి గోడౌన్ల నిర్వాహకులు ధాన్యాన్ని సేకరించారని పంజాబ్ మాన్సా జిల్లాలోని ఎఫ్ సీఐ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్ లో మంచి రేటుకు అమ్ముకున్నట్టు చెబుతున్నారు.


More Telugu News