ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగనున్న అన్నా హజారే

  • రైతు సమస్యలపై అన్నా హజారే నిరశన దీక్ష
  • సొంత పట్టణం రాలేగావ్ సిద్ధిలో దీక్ష
  • రైతుల కష్టాలను కేంద్రం వినడం లేదని విమర్శ
ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తన సొంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. తన మద్దతుదారులందరూ వారివారి ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా రైతుల సమస్యలపై తాను పోరాడుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 84 ఏళ్ల హజారే విమర్శించారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం వినడం లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించిన తమ డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు.

గత మూడు నెలల్లో ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఐదు సార్లు లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు తమతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

2018లో ఢిల్లీలో తాను ఢిల్లీలో దీక్ష చేపట్టానని... సమస్యలను పరిష్కరిస్తామని అప్పుడు కేంద్రం తనకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని హజారే తెలిపారు. కానీ, ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు.


More Telugu News