మరిన్ని టీకాలను ప్రపంచానికి ఇవ్వనున్నాం: ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రధాని మోదీ

  • 'మేడిన్ ఇండియా' కరోనా టీకాలు ఓ వరం 
  • 50 దేశాలకు అత్యవసర ఔషధాలు ఇచ్చాం
  • కరోనాపై పోరాటంలో ప్రపంచానికి సహకారం
  • వర్చ్యువల్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ
ప్రపంచానికి 'మేడిన్ ఇండియా' కరోనా టీకాలు ఓ వరమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కరోనాపై గెలిచే దిశగా ప్రపంచానికి భారత్ తనవంతు సాయం చేస్తోందని, ఇప్పటికే తాము రెండు టీకాలను తయారు చేశామని, త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వస్తాయని ఆయన అంచనా వేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి, ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

ఇప్పటివరకూ ఇండియా నుంచి 50 దేశాలకు ఎమర్జెన్సీ ఔషధాలను అందించామని, తయారవుతున్న టీకా వయల్స్ లో చాలా దేశాలకు భాగం పంచామని ఆయన గుర్తు చేశారు. ఓ వైపు కరోనాను ఎదుర్కొంటూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా పలు చర్యలు తీసుకున్నామని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిని సారించామని మోదీ వ్యాఖ్యానించారు.

ఇండియా నగదు రహిత దేశంగా మారేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నదని చెప్పిన మోదీ, భారత ప్రజల్లో 130 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని, అవి స్మార్ట్ ఫోన్ లతో అనుసంధానం అయ్యాయని, డిసెంబర్ లో 4 ట్రిలియన్ రూపాయల విలువైన లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగాయని తెలిపారు. ప్రపంచంలోనే అతి తక్కువగా డేటా చార్జీలు ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని అన్నారు.

ఇక, తన ప్రసంగం అనంతరం, సదస్సులో పాల్గొన్న వ్యాపార, వాణిజ్య వేత్తల ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు. సీమన్స్ సీఈఓ జో కేసర్, మాస్టర్ కార్డ్ ప్రతినిధి అజయ్ బంగా, ఐబీఎం తరఫున పాల్గొన్న అరవింద్ కృష్ణ తదితరులతో మోదీ మాట్లాడారు.


More Telugu News