తెలంగాణలో త్వరలో నిరుద్యోగ భృతి.. ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన: కేటీఆర్

  • త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ
  • సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణకు రెండో స్థానం
  • తలసరి విద్యుత్ వినియోగంలో మొదటి స్థానం
తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి, రెండు రోజుల్లోనే నిరుద్యోగ భృతిని ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనుబంధ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో తెలుగునాడు కార్మిక విభాగం విలీనం సందర్భంగా టీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాము ఇప్పటికే 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

గతంలో వారానికి మూడు రోజులు విద్యుత్ కోతలు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వెతలు తీర్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ సమస్య లేదన్నారు. భవిష్యత్తులో ఎక్కడా కరెంటు పోవడం అనే సమస్యే ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు. సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తొలి స్థానంలో ఉందని అన్నారు. దేశంలో పరిశ్రమలకు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ స్పష్టం చేశారు.


More Telugu News