అయోధ్యలో మసీదును నిర్మించడంపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కూల్చిన చోట మళ్లీ మసీదు నిర్మించడం సరికాదు
  • ఆ మసీదులో ప్రార్థనలు చేయడం కూడా తప్పే
  • మత పెద్దల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నా
అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనికోసం పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కూడా కొనసాగుతోంది. మరోవైపు మసీదు నిర్మాణానికి కూడా ముస్లిం పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో మసీదు నిర్మాణంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య మసీదు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఒవైసీ చెప్పారు. బాబ్రీ మసీదును కూల్చిన చోట మసీదును నిర్మించడం అనైతికమని వ్యాఖ్యానించారు. అలాంటి చోట ప్రార్థనలు చేయడం కూడా తప్పేనని మత పెద్దలు చెపుతున్నారని అన్నారు. ముస్లిం పెద్దల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు.

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉలేమా కూడా దాన్ని మసీదు అని పిలవకూడదని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని చెప్పారని ఒవైపీ తెలిపారు. మసీదు నిర్మాణానికి చందాలు ఇవ్వడం తప్పని చెప్పారు. ఎన్నికలలో దళితులతో ముస్లింలు ఎవరూ పోటీ పడకూడదని సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినని, దళితులకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. దేశంలో శాంతిని కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు.


More Telugu News