2019 నాటి ఓటరు జాబితాతో ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • పాత ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారన్న విద్యార్థిని అఖిల
  • 3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారని వెల్లడి
  • పిటిషనర్ వాదన అర్థరహితమన్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది
  • పూర్తి వివరాలతో రేపు వాదనలు వినిపిస్తామన్న పిటిషనర్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2019 నాటి ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పాత జాబితా కారణంగా 3.6 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతోందని విద్యార్థిని అఖిల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వారందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి వస్తుందని అఖిల తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే, పిటిషనర్ వాదన అర్థరహితమని ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అసలు, పిటిషనర్ ఓటు కోసం దరఖాస్తే చేయలేదని వెల్లడించారు. ఆ పిటిషన్ ను కొట్టివేయాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దాంతో పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో రేపు వాదనలను వినిపిస్తామని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దాంతో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.


More Telugu News