చైనాకు చెక్​ పెట్టేందుకు ఇండియన్​ ఆర్మీ కొత్త తంత్రం..టిబెటాలజీ అధ్యయనం!

  • టిబెట్ చరిత్ర, సంస్కృతి, భాషపై మన వారికి కఠిన శిక్షణ
  • ఏడు విద్యా సంస్థల్లో రెండేళ్ల పీజీ కోర్సులున్నట్టు గుర్తించిన ఆర్ట్రాక్
  • వాటిలో ఎంపిక చేసిన అతి కొద్ది మందికి శిక్షణ ఇవ్వాలని సిఫార్సు
  • ‘స్టడీ లీవ్’ కింద విద్యా సంస్థల్లో అధికారులకు బోధన
  • చైనా ఆగడాలను ఆపాలంటే ఇదే చాలా కీలకమంటున్న ఆర్మీ
వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవలి కాలంలో చైనా ఆగడాలు పెచ్చుమీరాయి. బలగాలను పంపుతూ, సరిహద్దులు దాటిస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది ఆ దేశం. అంతే దీటుగా మన సైన్యమూ చైనాకు గట్టిగా బుద్ధి చెబుతోంది. అయితే, తాజాగా చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం ఇంకో కొత్త స్కెచ్ వేసింది. పాత ప్లాన్ నే కొత్తగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అదే టిబెటాలజీ!

వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దులకు ఇరువైపులా టిబెట్ చరిత్ర, సంస్కృతి, భాషపై అధ్యయనం చేయాల్సిందిగా ఆర్మీ అధికారులను ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. అక్కడ చైనా ప్రభావం, ప్రచార ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి ఈ టిబెటాలజీ ప్రతిపాదనను అక్టోబర్ లో జరిగిన ఆర్మీ కమాండర్స్ సదస్సులోనే ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆర్మీ అధిపతి జనరల్ ఎంఎం నరవాణే ఆదేశాలతో సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఆర్ట్రాక్) ఆ టిబెటాలజీ ప్రతిపాదనను విశ్లేషిస్తోంది.

అందులో భాగంగా టిబెట్ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలపై పీజీ కోర్సులను బోధిస్తున్న ఏడు విద్యా సంస్థలను ఆర్ట్రాక్ గుర్తించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ (ఢిల్లీ యూనివర్సిటీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (వారణాసి), నవ నలందా మహావిహార (బీహార్), విశ్వ భారతి (పశ్చిమబెంగాల్), దలై లామా ఇనిస్టిట్యూట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (బెంగళూరు), నంగ్యాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ (గ్యాంగ్ టక్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ కల్చర్ స్టడీస్ (దహుంగ్, అరుణాచల్ ప్రదేశ్)లలో టిబెట్ సంస్కృతిపై కోర్సులున్నట్టు పేర్కొంది.


ఆర్మీ అధికారులను ‘స్టడీ లీవ్’ కింద ఆయా విద్యాసంస్థలకు పంపించి టిబెట్ పై పూర్తి అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది. అయితే, మరీ ఎక్కువ మంది కాకుండా కొద్ది కొద్ది మందినే అక్కడికి పంపించాలని ఆర్ట్రాక్ సిఫార్సు చేసింది. పాకిస్థాన్ కు సంబంధించినంత వరకు మన ఆర్మీ అధికారులకు దాదాపు అన్ని విషయాలు తెలుసని, ఇప్పుడు చైనా విషయంలోనూ అదే నిపుణత అవసరం అని ఓ ఆర్మీ అధికారి చెప్పారు. చైనా ఆర్మీ గురించి పూర్తి అవగాహన ఉన్న అధికారులు అతి కొద్ది మందే ఉన్నారన్నారు.

టిబెట్ విషయానికొస్తే అది మరింత దారుణంగా ఉందని ఆయన చెప్పారు. అందుకే చైనా, టిబెట్ గురించి ఆర్మీ అధికారులకు పూర్తి అవగాహన కల్పించేందుకే వారికి దీనిపై ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. ఆ రెండింటికి సంబంధించి భాష, సంస్కృతి, వారి ప్రవర్తన తీరును పూర్తిగా తెలుసుకునేలా కోర్సులపై బోధన ఇప్పిస్తామన్నారు.

వాస్తవాధీన రేఖ వెంబడి దీర్ఘకాలం పాటు పనిచేసే ఎంపిక చేసిన కొద్ది మంది సీనియర్ అధికారులకు దీనిపై ట్రైనింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, రెండేళ్ల మాండరిన్ కోర్సును చదివినంత మాత్రాన పూర్తి నైపుణ్యం రాదని, దానిపై లోతైన శిక్షణ ఉంటుందని చెప్పారు.

వాస్తవానికి భారత్ ఎప్పుడూ టిబెట్ కార్డ్ ను వాడుకోలేదు. 1954లోనే టిబెట్ పై భారత్ పట్టు కోల్పోయిందని నిపుణులు చెబుతుంటారు. ఆ టైంలోనే చైనాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంతోనే టిబెట్ విషయం ఇండియా నుంచి చేజారిందన్న వాదనలున్నాయి. దానికి కారణం, ఆ వాణిజ్య ఒప్పందంలో టిబెట్ తమ ప్రాంతమని చైనా చెప్పుకొంది.

అయితే, ఈ మధ్య ఆ పరిస్థితి మారుతోంది. టిబెట్ లో చైనా ఆగడాలు శ్రుతి మించుతుండడంతో అక్కడి ప్రజలు తమది చైనా కాదని చెబుతున్నారు. దీంతో అక్కడ చైనా అణచివేతలు మొదలయ్యాయి. అక్కడి నుంచి భారత్ లోకి చాలా మంది శరణార్థులుగా వచ్చారు. అలాంటి వారిని గుర్తించి భారత సైన్యం కోవర్ట్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.

శరణార్థి టిబెటన్లతో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ప్రత్యేక పోరాట దళాలు)ను ఏర్పాటు చేసింది. ఆర్మీలో అంతర్భాగం చేసింది. ఆగస్టులో చైనా పాంగోంగ్ సరస్సును ఆక్రమించినప్పుడు.. కైలాష్ శ్రేణిని మన గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో ఈ ప్రత్యేక పోరాట దళాలే కీలక పాత్ర పోషించాయి.


More Telugu News