తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలభీముడి జననం... బరువు 5 కిలోలు!
- నందివెలుగు గ్రామానికి చెందిన రేష్మకు కాన్పు
- శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేసిన డాక్టర్లు
- అసాధారణ శిశువు జననం
- ఇంత బరువుండడం చాలా అరుదన్న డాక్టర్లు
గుంటూరు జిల్లా తెనాలిలో బాలభీముడు జన్మించాడు! 5 కిలోల బరువుతో అసాధారణ రీతిలో జన్మించిన ఈ మగశిశువు వైద్య వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన రేష్మ తొలికాన్పులోనే అధిక బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు రేష్మకు సిజేరియన్ (శస్త్రచికిత్స) ద్వారా కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువులు 2 కేజీల నుంచి 4 కేజీల బరువు ఉంటారని, కానీ 5 కేజీల బరువుతో జన్మించడం చాలా అరుదు అని వివరించారు.