స్థానిక ఎన్నిక‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌తో జ‌న‌సేన‌, బీజేపీ నేతల‌ భేటీ.. ప్ర‌భుత్వంపై ఆరోపణలు

  • రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించాం
  • గ‌తంలో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకున్నారు:  నాదెండ్ల‌
  • ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని కోరాం
  • రాష్ట్రంలో దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి:  సోము వీర్రాజు
స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గవ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, బీజేపీ నేతలు క‌లిసి ఈ విష‌యంపై చ‌ర్చించారు. ప‌లు అంశాల‌పై గ‌వర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి వారిలో జనసేన నేత‌ నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. అనంత‌రం వారిద్ద‌రు మీడియాతో మాట్లాడారు.
 
రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించామ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. గ‌తంలో నామినేష‌న్లు వేయ‌కుండా వైసీపీ నేత‌లు కుట్ర పూరితంగా అడ్డుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు తావు లేకుండా చూడాల‌ని తాము కోరామ‌ని వివ‌రించారు.

వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌లోభాలు పెడుతూ, మ‌రోవైపు బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ ఏక‌గ్రీవాల‌కు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. అలాగే, వాలంటీర్ల ద్వారా కూడా వైసీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని చెప్పారు. స్థానిక సంస్థ ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరామ‌ని సోము వీర్రాజు తెలిపారు.

రాష్ట్రంలో దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నప్ప‌టికీ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం వాటిపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. అలాగే, ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌కు పిలుపునిస్తే వారిని గృహ నిర్బంధానికి గురి చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో మ‌త విద్వేషాల‌ను ప్ర‌భుత్వ‌మే రెచ్చ‌గొడుతుంద‌ని తెలిపారు. చ‌ర్చి ఫాద‌ర్ల‌కు ప్ర‌జాధ‌నాన్ని ఎందుకు పంచుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.


More Telugu News