భారత స్టాక్ మార్కెట్ కు మరింత నష్టం... నెల రోజుల కనిష్ఠానికి సూచికలు!

  • కొన్ని రోజులుగా నష్టాల్లోనే మార్కెట్
  • ప్రస్తుతం 47 వేల దిగువన సెన్సెక్స్
  • 122 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
గత కొన్ని రోజులుగా నష్టాల్లో నడుస్తున్న భారత స్టాక్ మార్కెట్లు, నేడు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ ముందుకు బడ్జెట్ రానుండటం, ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడికి తోడు, ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో గత వారంలో తొలిసారిగా 50 వేల పాయింట్ల స్థాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక, ఇప్పుడు నెల రోజుల కనిష్ఠంలో ట్రేడ్ అవుతోంది.

ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే, ఇన్వెస్టర్ల నుంచి కొత్త పెట్టుబడులకు బదులు, లాభాల స్వీకరణే అధికంగా కనిపించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ స్థాయి నుంచి 3 వేల పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు దిగువన కదులుతున్నాయి. ఈ ఉదయం 11.35 గంటల సమయంలో సెన్సెక్స్ 439 పాయింట్లు పడిపోయి 46,970 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 122 పాయింట్లు పడిపోయి 13,845 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.


More Telugu News