ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పాలు.. ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా

  • ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
  • ఐపీవోకు జీవిత బీమా సంస్థ
  • ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు కంపెనీలు ప్రైవేటు పరం
ప్రస్తుతం కాస్తోకూస్తో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇక కనిపించకపోవచ్చు. రైల్వే వంటి అతిపెద్ద సంస్థలోకే ప్రైవేటు పెట్టుబడులు వచ్చి చేరిన వేళ.. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రైవేటీకరణ విధానానికి నిన్న కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అలాగే, భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో నాలుగు కంపెనీల ప్రైవేటీకరణ, ఒక మెగా ఐపీవో ఉండొచ్చని సమాచారం.

నిజానికి గత బడ్జెట్‌లోనే సీతారామన్ రూ. 2.1 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రకటించారు. అయితే, కరోనా కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో ఆ లక్ష్యం మరుగున పడింది. అంతకుముందు 2019లో భారత్‌ పెట్రోలియం, కంటైనర్‌ కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ల ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సహా ఈ కంపెనీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తొలి పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లే అవకాశం ఉంది.


More Telugu News