ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత.. పర్యాటకులెవరూ రావద్దు: ఏఎస్ఐ

  • ఈ నెల 19 నుంచి మూసే ఉన్న ఎర్రకోట
  • నిన్న ఎర్రకోటను సందర్శించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
  • నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలిపింది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అయితే, ఈ ఆదేశాల వెనక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

 కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా ఈ నెల 19 నుంచి 22 వరకు కోటను మూసివేశారు. ఆ తర్వాత గణతంత్ర వేడుకల సందర్భంగా 22 నుంచి 26 వరకు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 27 నుంచి ఎర్రకోట తెరుచుకుంటుందని పర్యాటకులు భావించారు. అయితే, 27 నుంచి 31 వరకు ఎర్రకోట మూసే ఉంటుందని ఏఎస్ఐ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

మూసివేతకు కారణాలు వెల్లడించనప్పటికీ, రిపబ్లిక్ డే నాడు రైతుల ఎర్రకోట ముట్టడే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముట్టడిలో దెబ్బతిన్న భాగాలను సరిచేసేందుకే మూసివేస్తున్నట్టు సమాచారం. సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఎర్రకోటను సందర్శించి ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏఎస్ఐని ఆదేశించారు.

రైతుల ముట్టడిలో ఎర్రకోట నిర్మాణం దెబ్బతిన్నదీ, లేనిదీ కూడా తెలియరాలేదు. అయితే, మంత్రి సందర్శనలో ధ్వంసమైన మెటల్ డిటెక్టర్ గేటు, టికెట్ కౌంటర్, పగిలిన అద్దాలు వంటివి కనిపించినట్టు తెలుస్తోంది. కాగా, ఎర్రకోట ఘటనను మంత్రి మొన్ననే ఖండించారు.


More Telugu News