ట్రంప్ అభిశంసన అవకాశాలు లేనట్టే!

  • ససేమిరా అంటున్న రిపబ్లికన్లు
  • ఐదుగురు సెనెటర్లు మాత్రమే అనుకూలం
  • కనీసం 17 మంది మద్దతుంటేనే అభిశంసన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించాలన్న డెమొక్రాట్ల ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. ట్రంప్ ను అభిశంసిస్తే, తమ పార్టీ పరువు పోతుందని భావిస్తున్న మెజారిటీ రిపబ్లికన్ సెనెటర్లు ఇప్పుడు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని అంటూ 45 మంది రిపబ్లికన్ సెనెటర్లు మద్దతిచ్చేందుకు సమేమిరా అనగా, మరో ఐదుగురు మాత్రమే ట్రంప్ తప్పు చేశారని అంగీకరిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని డెమొక్రాట్లు తప్పుబట్టడంపై మండిపడిన సెనెటర్ రాండ్ పాల్, వాస్తవ విద్వేష ప్రసంగాలు డెమొక్రాట్ల నుంచే వచ్చాయని, హింసను రెచ్చగొట్టింది వారేనని అన్నారు. ట్రంప్ పై చర్యలు తీసుకోవాలన్న పనికిమాలిన ఆలోచనను వదిలేయాలని మార్క్ రూబియో, టెడ్ క్రూజ్, లిండ్సే గ్రాహం తదితరులు వ్యాఖ్యానించారు.

సెనెట్ లో ట్రంప్ ను అభిశంసించాలంటే, డెమొక్రాట్లకు కనీసం 17 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం. ప్రస్తుతం వాస్తవ బలం రెండు పార్టీలకు సమానంగా ఉండగా, ఐదుగురు మాత్రం ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేశారు. మిట్ రోమ్నీ, పాట్ టూమీ, సుసాన్ కోలిన్స్, బెన్ సాసే, లిసా ముర్కోవిస్కీ లు డెమొక్రాట్ల వెంట ఉన్నారు.

ఇక అభిశంసనంటే పదవి నుంచి కిందకి దింపడమేనని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిపై అభిశంసన ఏంటని కొందరు కొట్టిపారేస్తున్నారు. డెమొక్రాట్లు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని మరో సెనెటర్ రూబియో వ్యాఖ్యానించారు. ట్రంప్ తప్పు చేసుంటే కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చే తప్ప, అభిశంసనకు తాము అంగీకరించబోమన్నారు.


More Telugu News