ఎస్ఈసీ సిఫారసులు మాత్రమే చేయగలరు...అధికారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు: సజ్జల

  • అధికారులను ప్రభుత్వం కాపాడుకుంటుందన్న సజ్జల
  • అడ్డగోలు ఆదేశాలను సర్కారు అమలుచేయదని వెల్లడి
  • ఎస్ఈసీ అభ్యంతరకర భాష వాడుతున్నారని ఆరోపణ
  • పరిధిని మించి వ్యవహరిస్తున్నారని విమర్శలు
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని హితవు పలికారు. అధికారుల పట్ల నిమ్మగడ్డ ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరం అన్నారు. ఎస్ఈసీగా తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విడుదల చేసిందని, ఆ లెక్కన గ్రామాల్లో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే ఎలా లేదన్నా రెండు నెలలు పడుతుందని అన్నారు. ఆ విషయం నిమ్మగడ్డకు కూడా తెలుసని, అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. అధికారులు, ఉద్యోగుల్లో భయానక వాతావరణం సృష్టించేందుకు ఎస్ఈసీ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోందని తెలిపారు.

అయితే, ఎస్ఈసీ సిఫారసులు మాత్రమే చేయగలరని, అధికారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు. ఎస్ఈసీ అడ్డగోలుగా ఇచ్చే ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయదని స్పష్టం చేశారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కొన్నిరోజులు విధుల నుంచి తప్పించగలరేమో కానీ, అధికారులను ప్రభుత్వం కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు.

వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాకపోవడంతో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసిస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News