7.5 శాతం ఫిట్ మెంట్ పై తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి... ఆందోళనకు సిద్ధం!

  • పీఆర్సీ సిఫారసుల అమలుకు సర్కారు నిర్ణయం
  • ఫిట్ మెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు
  • సెక్రటేరియట్ ముందు ఆందోళన చేయాలని నిర్ణయం
  • బీఆర్కే భవన్ ముందు పీఆర్సీ ప్రతుల దహనానికి నిర్ణయం 
వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) నివేదికను తెలంగాణ సర్కారు ఇవాళ విడుదల చేసిన నేపథ్యంలో, పీఆర్సీ కమిటీ నివేదికపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమిటీ నివేదికలో మూలవేతనంపై కేవలం 7.5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ప్రతిపాదించడం పట్ల ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై సెక్రటేరియట్ ముందు ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. బీఆర్కే భవన్ ఎదుట పీఆర్సీ ప్రతులు దహనం చేయాలని నిర్ణయించారు.

కాగా, ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు, గరిష్ఠ వేతనం రూ.1,62,070 వరకు ఉండొచ్చని పీఆర్సీ నివేదికలో సిఫారసు చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని సూచించారు. శిశు సంరక్షణ సెలవులు 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచడంతోపాటు, సీపీఎస్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని సిఫారసు చేశారు. ఈ సిఫారసులను 2018 జూలై 1వ తేదీ నుంచి వర్తించేలా అమలు చేయాలని పేర్కొన్నారు. 


More Telugu News