మదనపల్లె ఘటనలో పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

  • మదనపల్లెలో కుమార్తెలను హత్యచేసిన దంపతులు
  • మూఢనమ్మకాలతో ఘాతుకం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరు
  • మదనపల్లె జైలుకు తరలింపు
మూఢనమ్మకాలతో మతిభ్రమించి తమ కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యలను అంతమొందించిన పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులకు మదనపల్లె కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మదనపల్లెలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు పద్మజ, పురుషోత్తంనాయుడులను అరెస్ట్ చేసి ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం ఇద్దరినీ మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

అంతకుముందు పోలీసుల విచారణలో పద్మజ, పురుషోత్తంనాయుడు ప్రతి ప్రశ్నకు దేవుడు, దయ్యాలతో ముడిపెడుతూ చిత్రవిచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనూ నమ్మశక్యం కాని రీతిలో ప్రవర్తిస్తూ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల ఆ కుటుంబం తమ వీధిలో షికారుకు వెళుతూ పూజ చేసిన నిమ్మకాయలను తొక్కడంతో, ఏదైనా జరుగుతుందేమోనని భయపడడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.


More Telugu News