తమ వ్యాక్సిన్ తయారీని నిలిపివేయాలని యూఎస్ దిగ్గజం మెర్క్ సంచలన నిర్ణయం!

  • ట్రయల్స్ లో ఉపయోగం లేదని వెల్లడి
  • రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన మెర్క్
  • కరోనా విషయంలో విఫలమయ్యామని ప్రకటన
యూఎస్ ఔషధ దిగ్గజం మెర్క్ అండ్ కో సంచలన నిర్ణయం తీసుకుంది. తాము రూపొందించిన రెండు పరిశోధనాత్మక కరోనా వ్యాక్సిన్ లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు వ్యాక్సిన్ లూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేలా యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమైనట్టు ప్రాధమిక ట్రయల్స్ గణాంకాలు వెల్లడించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నో విజయవంతమైన వ్యాక్సిన్ లను తయారు చేయడంతో పాటు, సరఫరా చేస్తున్న మెర్క్, కరోనా విషయంలో మాత్రం విఫలం కావడం గమనార్హం.

తమకు ప్రధాన పోటీదారులుగా ఉన్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ లతో పోలిస్తే, విభిన్నమైన వ్యూహంతో కరోనా టీకా తయారీలో నిమగ్నమైన మెర్క్, బలహీనమైన వైరస్ ఆధారిత టీకాను తయారు చేయడం ద్వారా సంప్రదాయ మార్గాన్ని అనుసరించింది. 'వీ590' పేరిట ఓ వ్యాక్సిన్ ను 'వీ591' మరో వ్యాక్సిన్ నూ మెర్క్ అభివృద్ధి చేసింది. వీటిల్లో ఒకటి ఎబోలా వైరస్, మరోటి మీజిల్స్ వ్యాక్సిన్ ఆధారిత సాంకేతికతతో మెర్క్ అభివృద్ధి చేసింది.

అయితే, ఈ రెండు వ్యాక్సిన్లూ ప్రపంచ కరోనా టీకా పోటీలో వెనుకంజ వేశాయి. తొలి దశ ట్రయల్స్ లో వీటితో ఏ మాత్రమూ ఉపయోగం లేదని తేలింది. మిగతా సంస్థల వ్యాక్సిన్లు ప్రజలకు పంచే దశకు చేరిన నేపథ్యంలో, తమ టీకాల ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని మెర్క్ నిర్ణయించింది.

 "ఈ ఫలితాలు మాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. వీటితో మేము నిరుత్సాహపడ్డాం. మేము వేయాలనుకున్న అడుగులు వేయలేకపోయాము. వ్యాక్సిన్ తయారీకి శ్రమించిన శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు" అని మెర్క్ క్లినికల్ రీసెర్చ్ విభాగం ఉపాధ్యక్షుడు నిక్ కార్ట్ సోనిస్ ఓ ప్రకటనలో తెలిపారు.


More Telugu News