ప్రధాని మోదీ ఈ పుస్తకం చదివితే తప్పకుండా తమిళ భాషను, సంస్కృతిని గౌరవిస్తారు: రాహుల్ గాంధీ

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం
  • నేడు కరూర్ లో ప్రసంగం
  • తాను 'తిరుక్కురాళ్' పుస్తకం చదువుతున్నట్టు వెల్లడి
  • తమిళులను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. తన మూడు రోజుల ప్రచారంలో భాగంగా ఇవాళ చివరిరోజున ఆయన కరూర్ లో పర్యటించారు. భారీగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలను, వారి సంస్కృతిని అర్థం చేసుకునేందుకు తాను 'తిరుక్కురాళ్' పుస్తకాన్ని చదువుతున్నానని, ప్రధాని మోదీ ఇంతవరకు ఆ పుస్తకాన్నే తెరవలేదని అన్నారు.

"మీరు (తమిళులు) ఎంత బలహీనులైనా కావచ్చు కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ హుందాతనాన్ని, ఆత్మాభిమానాన్ని, తమిళ స్ఫూర్తిని మాత్రం మీరు కోల్పోరు. నేను కూడా ఇప్పుడు తమిళ స్ఫూర్తి అంటే ఏమిటి? అనేది తెలుసుకుంటున్నాను. అందుకే 'తిరుక్కురాళ్' పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఈ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కొత్తేమీ కాదు, అవి మీ భాష, సంస్కృతిలోనే అంతర్లీనంగా కదలాడుతుంటాయి" అని వివరించారు.

ఒకవేళ ప్రధాని మోదీ గనుక 'తిరుక్కురాళ్' పుస్తకాన్ని చదివితే మాత్రం తప్పకుండా తమిళ భాషను, తమిళ ప్రజల సంస్కృతిని అర్థం చేసుకుంటారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.


More Telugu News