సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం: అచ్చెన్నాయుడు

  • ఎస్ఈసీకి అనుకూలంగా సుప్రీం తీర్పు
  • ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్ధులేనన్న అచ్చెన్న
  • అతీతంగా ఉంటే ఎదురుదెబ్బలు తప్పవని వ్యాఖ్య 
  • ఉద్యోగ సంఘాలు ఎటువైపో తేల్చుకోవాలని సూచన
పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్య విజయం అని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగ బద్ధుడేనని గుర్తెరగాలని హితవు పలికారు. పాలకుడైనా, పౌరుడైనా రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అతీత శక్తులుగా వ్యవహరించాలని భావిస్తే ఎదురుదెబ్బలు తప్పవని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పనిచేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రజలు, వ్యవస్థలు మాత్రమే శాశ్వతం తప్ప ప్రభుత్వాలు కాదని ఉద్ఘాటించారు. జగన్ కోసం పనిచేస్తే రాజ్యాంగం చేతుల్లో చెప్పుదెబ్బలే రివార్డులని అన్నారు. కోర్టులతో ఎదురుదెబ్బలు తింటున్న జగన్ వెంట నడుస్తారో, ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోవాలని తెలిపారు.

సుప్రీం తీర్పుపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందిస్తూ... కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్ర బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికలు జరగాలని అన్నారు. గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News