ఈ ప్రభుత్వం మరింత అప్రదిష్ఠపాలైంది: సోమిరెడ్డి

  • ఎన్నికల వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న సోమిరెడ్డి
  • రాజ్యాంగ విలువలను పరిరక్షించే తీర్పు అంటూ వ్యాఖ్యలు
  • రాజ్యాంగ ధర్మాసనం తీర్పులను ఎవరూ వ్యతిరేకించలేరని వెల్లడి
ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను దిగ్విజయంగా నెరవేర్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. సంక్షోభ పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలు, గౌరవం కాపాడిన కోర్టుకు అభినందనలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం తగదని శేషన్ హయాంలోనే ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచి తీర్పునిచ్చిందని సోమిరెడ్డి వెల్లడించారు. ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పులను వ్యతిరేకించే అధికారం హైకోర్టులకు, ఇద్దరు ముగ్గురు జడ్జిలు ఉండే సుప్రీంకోర్టు బెంచిలకు కూడా లేదని స్పష్టం చేశారు. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలిసిన విషయమేనని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి ఎందరో సలహాదారులు, న్యాయనిపుణులు ఉన్నా ఇలాంటి సంక్షోభం తలెత్తే పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరమని, దీంతో ఈ ప్రభుత్వం మరింత అప్రదిష్ఠపాలైందని సోమిరెడ్డి విమర్శించారు.


More Telugu News