కూకట్ పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహాలు ధ్వంసం!

  • సర్దార్ నగర్ లోని దుర్గామాత ఆలయంలో దాడులు
  • కుక్కను చంపి వేలాడదీసిన వైనం
  • ఆలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు ప్రకటించిన ఎమ్మెల్యే మాధవరం
ఏపీలో హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతాలను మర్చిపోక ముందే ఆ దారుణాలు తెలంగాణకు పాకాయి. హైదరాబాద్ కూకట్ పల్లి, మూసాపేట, సర్దార్ నగర్ లోని దుర్గామాత ఆలయంలోని విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఓ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, అక్కడి నుంచి తొలగించారు. అదే ఆలయంలో ఉండే జంట నాగుల విగ్రహాలను ముక్కలు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. మరోవైపు, ఆలయ ఆవరణలో ఒక కుక్కను చంపి, వేలాడదీశారు.

జరిగిన ఘటన పట్ల హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందు ఆందోళనకు దిగారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు కూడా ఘటనా స్థలికి వెళ్లారు. ఆలయంలో జరిగిన దాడులను ఆయన పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆందోళన చేస్తున్న భక్తులతో ఆయన మాట్లాడారు. తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 5 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది.


More Telugu News