ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రగడ.. గుజరాత్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • రెండు దశలుగా ఎన్నికలు
  • రెండు వేర్వేరు తేదీల్లో ఓట్ల లెక్కింపు
  • కోర్టుకెళ్తామన్న కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రగడ కొనసాగుతుండగానే గుజరాత్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, కాబట్టి వాయిదా వేయాలని కోరుతోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకే ఎన్నికల సంఘం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది.

ఈ విషయంలో నేడు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది. మరోవైపు, గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నగరపాలక సంస్థలకు వచ్చే నెల 21న, 81 పురపాలక సంఘాలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు 28న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. నగర పాలక సంస్థల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 23న, మిగిలిన వాటికి మార్చి 2న లెక్కింపు జరగనుంది. కాగా, ఓట్ల లెక్కింపును ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు రోజుల్లో చేపట్టనుండడంపై కోర్టులో సవాలు చేయనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.


More Telugu News