దేశంలో స్త్రీ శిశువుల జనన రేటు పెరిగింది... ఇవిగో గణాంకాలు!

  • పురుడుపోసుకుంటున్న పిల్లల లింగ నిష్పత్తిని వెల్లడించిన కేంద్రం
  • 2014–15తో పోలిస్తే 2019–2020లో మెరుగైందని వెల్లడి
  • దేశవ్యాప్తంగా 422 జిల్లాలు మెరుగైన పురోగతి చూపాయని ప్రశంస
ఒకప్పుడు పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే.. కన్ను తెరవకుండానే ఆ కడుపులోనే ప్రాణం తీసేసేవారు చాలా మంది. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయి అనగానే చాలా మంది ఏదో తెలియని అభద్రతకు గురవుతున్నారు. ఆ సమస్యలన్నింటినీ దాటుకుంటూ దేశంలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. 2014–2015తో పోలిస్తే 2019–2020లో పురుడుపోసుకుంటున్న పిల్లల లింగ నిష్పత్తిలో (సెక్స్ రేషియో ఎట్ బర్త్– ఎస్ఆర్బీ) వారి సంఖ్య కొంచెం పెరిగింది.

2014–2015లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిల జననంతో పోల్చితే 918 మంది అమ్మాయిలు పుట్టగా.. ఇప్పుడది 934కు పెరిగింది. శనివారం హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో కలిసి చేసిన సర్వే వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది.

2015 జనవరిలో ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కార్యక్రమంతో ఆడపిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 640 జిల్లాల్లో 422 జిల్లాలు ఎస్ఆర్బీ విషయంలో మెరుగయ్యాయని చెప్పింది. 2014–15లో ఆడపిల్లలు అత్యంత తక్కువగా ఉన్న జిల్లాల్లో.. భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ లోని మౌలో వెయ్యి మంది అబ్బాయిలకు 694 మందే ఆడపిల్లలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 951కి పెరిగిందని పేర్కొంది. హర్యానా కర్నాల్ లో 758 నుంచి 898కి, హర్యానాలోని మహేందర్ గఢ్ లో 791 నుంచి 919కి, హర్యానాలోని రేవారిలో 803 నుంచి 924కు, పంజాబ్ పాటియాలాలో 847 నుంచి 933కు పెరిగిందని తెలిపింది.


More Telugu News