భక్తుల కోలాహలం, భారీ భద్రత మధ్య రామతీర్థానికి చేరిన నూతన విగ్రహాలు!

  • రామతీర్థం వద్ద విగ్రహాలకు ప్రత్యేక పూజలు
  • 28న బాలాలయంలో ప్రతిష్ఠాపన
  • ఏడాదిలోగా ఆలయం పునర్నిర్మిస్తామన్న అధికారులు
తిరుపతి ఎస్వీ శిల్ప కళాశాలలో నిపుణులైన కళాకారులు తయారు చేసిన సుందరమైన సీతారామ, లక్ష్మణ, హనుమంతుని విగ్రహాలు విజయనగరం జిల్లా రామతీర్థానికి చేరాయి. రామతీర్థంలో ఉన్న విగ్రహాన్ని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా, తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపై ప్రభుత్వ ఆదేశాలతో నూతన విగ్రహాల తయారీ ప్రారంభమైంది. అనుకున్న సమయం కన్నా ముందుగానే ఈ విగ్రహాల తయారీ పూర్తయింది.

ఇక, శుక్రవారం నాడు దేవాదాయ శాఖ ఆర్జేసీ భ్రమరాంబ స్వయంగా తిరుపతికి వెళ్లి, ప్రత్యేక వాహనంలో భద్రత మధ్య ఈ విగ్రహాలను రామతీర్థానికి చేర్చారు. వీటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలిరాగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. ఆపై, గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తూ, విగ్రహాలను ఆలయం వద్దకు చేర్చి, ప్రత్యేక గదిలో భద్రపరిచారు.

ఈ నెల 28న బాలాలయంలో శాస్త్రోక్తంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని వెల్లడించిన ఆర్జేసీ, రామాలయం పునర్మిర్మాణం తరువాత విగ్రహాలను గర్భగుడిలో పునఃప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు ఒక్క ఏడాదిలోగా పూర్తవుతాయని వెల్లడించారు. అంతవరకూ బాలాలయంలో స్వామికి నిత్యపూజలు, భక్తులకు దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



More Telugu News