బైడెన్ సర్కారు వలస విధాన సంస్కరణలను స్వాగతించిన సుందర్ పిచాయ్, టిమ్ కుక్

  • సమగ్ర వలస విధానాన్ని ప్రతిపాదిస్తున్న జో బైడెన్
  • కాంగ్రెస్ వద్దకు బిల్లు
  • హర్షం వ్యక్తం చేస్తున్న టెక్ కంపెనీలు
  • అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని వ్యాఖ్యలు
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే  వలస విధానంపై దృష్టి సారించిన జో బైడెన్ సమగ్ర వలస విధానం బిల్లును కాంగ్రెస్ కు పంపారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మరమ్మతులు అవసరమని భావిస్తున్న బైడెన్ ఆ మేరకు సంస్కరణలకు తాము సిద్ధమని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అధికారిక పత్రాలు లేని వేలాది వలసదారులకు  పౌరసత్వం ఇచ్చేందుకు న్యాయబద్ధమైన విధానానికి కూడా ఆయన మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఐటీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాలకు బైడెన్ సంస్కరణలు ప్రముఖ టెక్ సంస్థల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.

బైడెన్ విధానాల పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ ప్రతిపాదిస్తున్న సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించడమే కాకుండా ఉద్యోగాల కల్పనకు బాటలు పరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను అమెరికా వైపు ఆకర్షిస్తాయని, ఇప్పుడు దేశంలో ఉన్న నిపుణులను కాపాడుకునేందుకు ఉపకరిస్తాయని వారు పేర్కొన్నారు.

సమగ్రమైన వలస విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్న బైడెన్ తన సంస్కరణలతో అమెరికా న్యాయ విలువలు, నైతికత, హుందాతనాన్ని ప్రతిఫలిస్తున్నారని టిమ్ కుక్ కొనియాడారు. సుందర్ పిచాయ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, అమెరికా కరోనా నుంచి బయటపడేందుకు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గూగుల్ సహకరిస్తుందని తెలిపారు.


More Telugu News