గంటకు 620 కిలోమీటర్ల వేగం.. మ్యాగ్లెవ్​ రైలు నమూనాను విడుదల చేసిన చైనా

  • 165 మీటర్ల పట్టాలపై 21 మీటర్ల రైలు
  • మీడియాకు దాని వివరాలు వెల్లడించిన పరిశోధకులు
  • 3 నుంచి 10 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడి
‘గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే’ అంటూ ఓ సినిమాలో హీరో పాటందుకుంటాడు. ఇదిగో చైనా తీసుకురాబోతున్న ఈ కొత్త రైలును ఎక్కితే కూడా అదే ఫీలింగ్ కలుగకమానదు. గంటకు 620 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఆ రైలు.. పట్టాలను తాకదు మరి. అయస్కాంత క్షేత్ర ప్రభావంతో పట్టాలు, రైలుకు మధ్య గ్యాప్ ఉంటుంది. అయస్కాంత ప్రభావంతో నడుస్తుంది కాబట్టి దీనిని మ్యాగ్లెవ్ అని పిలుస్తున్నారు.

హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ (హెచ్ టీఎస్) పవర్ తో నడిచే ఈ రైలు నమూనా (ప్రొటో టైప్)ను చైనా ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. 21 మీటర్ల (సుమారు 69 అడుగులు) పొడవున్న మ్యాగ్లెవ్ ను సిచువాన్ ప్రావిన్స్ లోని చెంగ్డు సిటీలో మీడియాకు చూపించింది. దానిని నిలిపి ఉంచేందుకు  వీలుగా ఆ ప్రొటోటైప్ ను తయారు చేసిన జియావోటోంగ్ యూనివర్సిటీ పరిశోధకులు 165 మీటర్ల పట్టాలను నిర్మించారు. ఆ రైలు ఎలా నడిచేది, అందులో ప్రయాణం ఎలా ఉండేది మీడియాకు వివరించారు.

మూడు నుంచి పదేళ్లలో ఈ రైలు అందుబాటులోకి వస్తుందని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హి చువాన్ చెప్పారు. సిచువాన్ నేలలో అరుదైన వనరులు చాలా ఉన్నాయని, ఇక్కడ శాశ్వత అయస్కాంత పట్టాలు నిర్మించేందుకు అనువుగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ లో చైనా రారాజు. ఏ దేశంలోనూ లేనంతగా అక్కడ 37 వేల కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా దూసుకెళ్లే రైళ్ల నెట్ వర్క్ ఉంది.

ఇప్పటికే ఆ దేశంలో ఓ మ్యాగ్లెవ్ రైలు పరుగులు పెడుతోంది. షాంఘై పుడోంగ్ ఎయిర్ పోర్ట్, లోంగ్యాంగ్ రోడ్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 2003లోనే దీనిని ప్రారంభించారు. 2022 శీతాకాల ఒలింపిక్స్ గేమ్స్ కోసం రైల్ నెట్ వర్క్ ను మరింతగా అభివృద్ధి చేయాలని చైనా భావిస్తోంది. ఒలింపిక్స్ ను నిర్వహించే ఝాంగ్జియాకూకు రాజధాని బీజింగ్ నుంచి 174 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే లైన్ ను గత ఏడాదే నిర్మించింది. మామూలుగా అయితే మూడు గంటల సమయం పట్టే ప్రయాణ సమయాన్ని.. హైస్పీడ్ రైల్వే లైన్ తో 47 నిమిషాలకు తగ్గించింది.


More Telugu News